సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం
- ఆశ, భయం.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కేలా చేస్తాయి
- అనుమానాస్పద లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
- సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్.శ్రీనివాస్
ప్రజల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన అవగాహన ద్వారానే సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేయొచ్చని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్. శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం నగరంలోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగణంలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ నేరాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్. శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఒకవైపు మనం ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం.. ఇదే సమయంలో మరోవైపు సాంకేతికత ఆసరాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షితంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించే విధానాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునేందుకు కారణమవుతాయని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలకు సంబంధించిన ఉదాహరణలు, ఇప్పటికే నమోదైన కేసులతో సహా వివరించి, ఎలా మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేశారు. డిజిటల్ అరెస్టులు, ఏసీబీ అధికారులమంటూ వచ్చే ఫేక్ కాల్స్ తదితరాలపైనా అవగాహన కల్పించారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, గోల్డెన్ అవర్‌లో టోల్ ఫ్రీ నంబర్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. https://www.ntrpolice.in/ వెబ్సైట్ లోని సమాచారాన్ని కూడా పొంది, సరైన అవగాహనతో సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ పొందాలన్నారు. సైబర్ నేరాలపై కేవలం వ్యక్తిగతంగా కాకుండా, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఐ ఎన్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఏఎస్ఐ బీడబ్ల్యూ దాసన్, డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, అడిషనల్ పీఆర్‌వో కె.రవి, ఏవీ సూపర్‌వైజర్ వీవీ ప్రసాద్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల డీసీవో ఎ.మురళీకృష్ణ, భూ సేకరణ కోర్టు రిజిస్ట్రార్ ఎన్.సూర్యనారాయణ, ఐ అండ్ పీఆర్, డా. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్టు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
