మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రహదారులపై మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని, వాహనం నడిపేటప్పుడు నిర్దేశిత వేగాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలో తాండూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన సదస్సుకు డి.సి.పి. ఎ.భాస్కర్, ఐ.పీ.ఎస్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనదారులు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, రహదారులపై నిర్దేశిత వేగంతో మాత్రమే వాహనాలను నడపాలని తెలిపారు.
18 సంవత్సరాల వయసు నిండి అర్హత కలిగిన వారు లైసెన్స్ పొందాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ తనిఖీలలో కట్టుబడినట్లైతే లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని, అయినప్పటికీ వాహనాలు నడిపినట్లయితే సదరు వ్యక్తికి సంబంధించిన లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు రహదారి భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని, కుటుంబ సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు.
తాండూర్ మండల కేంద్రానికి చెందిన మహిళ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధితురాలి కూతురు స్వాతికి బెల్లంపల్లి శాసనసభ్యులు 10 వేల రూపాయలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
