పంట మార్పిడి దిశగా రైతులు… ఎక్కువ లాభాలే లక్ష్యం……

TEJA NEWS

పంట మార్పిడి దిశగా రైతులు… ఎక్కువ లాభాలే లక్ష్యం……

జూలపల్లిలో వరి, మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

–ఎమ్మెల్యే విజయరమణ రావు…

పెద్దపల్లి// జూలపల్లి:
రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. శనివారం జూలపల్లి మండలంలోని చీమలపేట, నాగులపల్లి, తేలుకుంట, పెద్దాపూర్, జూలపల్లి, కోనరావుపేట గ్రామాలతో పాటు ఎలిగేడు మండలంలోని దూళికట్ట, ఎలిగేడు, నర్సాపూర్, నారాయణపల్లె గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 40 కిలోల బస్తాకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతో వరి ధాన్యం కోత పెట్టి రైతులను నష్టపరిచారని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎక్కడా గింజ కటింగ్ జరగకుండా రైతులకు న్యాయం చేశామని తెలిపారు. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.

సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు కూడా ధాన్యాన్ని మంచి ధరకు కొనుగోలు చేస్తున్నాయని, అన్ని ఖర్చులు కూడా వారే భరిస్తున్నారని పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి జూలపల్లి మండలంలో రైతులకు సుమారు రూ.3.79 కోట్ల బోనస్ లభించిందని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటంతోనే పంటలు బాగా పండుతున్నాయని చెప్పారు. గతంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడగా, ప్రస్తుతం ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు.
జూలపల్లి మండలంలో 3,781 మంది రైతులు 4,773 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని, లోకల్, సీడ్ విత్తనాలతో మంచి దిగుబడులు వస్తున్నాయని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పాడిపశువుల సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే భూమి సారవంతంగా మారుతుందని సూచించారు.

వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంట మార్పిడి పాటించిన రైతులకు అధిక దిగుబడులు వస్తున్నాయని వివరించారు. వరితో పాటు పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కేవలం వరిపైనే ఆధారపడకుండా పంట మార్పిడి ద్వారా అధిక లాభాలు పొందడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జూలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఐకేపి, సింగిల్ విండో సీసీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top