తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టి
** మోసగిస్తున్న వారిపై జనసేన ఇన్ చార్జి ఫిర్యాదు
తిరుపతి: భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకుని సోషియల్ మీడియాలో నయా మోసాలకు పాల్పడుతున్న గేమింగ్ యాప్ సృష్టికర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ కోరారు. ఈ విషయంపై గురువారం ఆయన టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బి.ఆర్) నాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తిరుమల మీద గేమ్ డిజైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విన్నవించానని తెలిపారు. తిరుమల శ్రీవారితో ఆట్లాడితే ఆ దేవుడే ఎవర్నీ వదలడని… గతంలో అనేక అనుభవాలు చూశామన్నారు. అయితే ఇప్పుడు సోషియల్ మీడియాలో భక్తులకు మోసం చేస్తూన్న వారికి విధించే శిక్షలతో ఇకపై ఎవరికైనా భయం పుట్టాలని తెలిపారు. యాప్ ద్వారా
తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలతో యాప్ రూపొందించిన కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దైవ భక్తిని…అదును చేసుకొని డాలర్స్ రూపంలో ఆన్ లైన్ లో వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గేమ్ డిజైన్ చేశారని అన్నారు.
శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుందని గేమ్ డిజైన్ చేశారని వెంటనే ఆ గేమ్ అకౌంట్ ని తొలగించాలని టీటీడీ ని కోరానన్నారు.
ఇటువంటి గేములు కొనసాగిస్తే ఉగ్రవాదులకి శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందనేది ఈజీగా తెలిసిపోతుందన్నారు.
భవిష్యత్తులో టీటీడీ పై ఏమైనా చేయాలంటే భయపడే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆయా ఆలయాలపై చాలా గేమ్ డిజైన్లను చేసి ఆన్ లైన్లో వదిలారని ఫిర్యాదులో తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలని కోరారు.
స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని
టీటీడీ చైర్మన్ నాయుడు హామీ ఇచ్చి, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
