
ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ సహాయం అందిస్తుంది…
_ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి// గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 18 స్కూటీలు, 7 ల్యాప్‌టాప్‌లు, 1 ఆధునిక 5G మొబైల్, 2 టాబ్లను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించి, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అలాగే అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 203 మంది అంగన్వాడీ సిబ్బందికి 5జి మొబైల్స్‌ను అందజేశారు. ఈ సాంకేతిక పరికరాల ద్వారా సేవలు వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో స్థానిక 37వ. డివిజన్‌కు చెందిన ఒక ఆయా సిబ్బందికి అంగన్వాడీగా పదోన్నతి కల్పించడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ సహాయం అందిస్తూ, ముఖ్యంగా వికలాంగులు మరియు మహిళా సిబ్బంది ఆత్మనిర్భరత సాధించేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి , డిప్యూటీ మేయర్ పాత పళ్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.