మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
• ప్రతి మత్స్యకారుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సంకల్పం
• మత్స్యకార సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
• ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం
- మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత, అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) నూతన చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మాట్లాడుతూ.. మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం ఎదుర్కొన్న సమస్యలపై అనేక పోరాటాలను చేసానన్నారు. అధిష్టానం, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత సూచనల మేరకు, సమైక్య 13 జిల్లాల మత్స్యకార సంఘాల మద్దతుతో మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్‌గా ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడం జరిగిందన్నారు..
స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రం లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి మత్స్యకారుడిని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి మత్స్యకారుడు పారిశ్రామికవేత్త గా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని అత్యంత ఎక్కువ నీటి వనరులు ఉన్నాయని. అటువంటి ఆఫ్ కాఫ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చైర్మన్ యాటగిరి రాంప్రసాద్, ఉపాధ్యక్షులు బి. రంగారావు లు అభినందనీయులన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, లక్షలాది కుటుంబాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 217 మత్స్యకారుల ప్రయోజనాలకు విరుద్ధమని, దానిపై పోరాడి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం ద్వారా దానిని రద్దు చేసామన్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసామన్నారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్ధిక సాయాన్ని (Ban Period Relief) 2019 లోనే ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక కార్పొరేషన్లకు కొత్త నాయకత్వం వచ్చిందని, పదవులను కేవలం అలంకారప్రాయంగా చూడకుండా సామాజిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
రాష్ట్ర బి.సి. సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం (EWS), చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ.. తెలివికి, ధైర్యానికి మారుపేరు మత్యకారులని, సముద్రంతో పోరాడి చేపలను వేటాడి సమాజానికి అందించే మత్స్యకారుల ధైర్యాన్ని, కృషిని మంత్రి అభినందించారు. మత్స్యకారులు ఎప్పటి నుంచో తమ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. బీసీలంటే తమ ప్రభుత్వమని.. దివంగత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మత్స్యకారుల భృతిని ₹10,000 నుండి ₹20,000 కు పెంచామన్నారు. గతంలో 9 మత్స్యకార గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, అందులో 47% రిజర్వేషన్లు మత్స్యకార బిడ్డలకే ఇచ్చామని గుర్తు చేశారు. డీజిల్ సబ్సిడీ, వలలు, పడవలు, ఐస్ బాక్స్ లు, మోపెడ్లపై సబ్సిడీలను అందిస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకం, విక్రయాల్లో మహిళలకు 60% సబ్సిడీ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. చేపలు, రొయ్యలు వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ, ఉత్పత్తితో పాటు వినియోగాన్ని కూడా పెంచాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులందరూ ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉండాలని మంత్రి సవిత తెలియజేశారు.
రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి మత్స్యకార సామాజిక వర్గం అంటే ఎంతో ఇష్టమని, స్వాతంత్ర్యం వచ్చిన 35 ఏళ్ల వరకు మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ దివంగత స్వర్గీయ ముఖ్యమంత్రి యన్.టి రామారావు నుండి వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. గత 44 ఏళ్లుగా కష్ట సుఖాల్లో మత్స్యకారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వెన్నంటి ఉంటున్నారని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనని, ఈ విషయాలను నేటి యువతకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, మన రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ కష్టార్జితంతో అభివృద్ధి సాధిస్తూ రాష్ట్రాన్ని గర్వపడేలా చేస్తున్నారని అభినందించారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించి, కనీసం డీజిల్ సబ్సిడీ, ప్రమాద బీమా వంటివి కూడా సరిగ్గా అందించలేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న నష్ట పరిహారాలను విడుదల చేశామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగాలని, ఆక్వా రంగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండేలా అందరం కలిసి పని చేయాలన్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఆర్థికంగా బలోపేతం కాగలమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు.
రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 240 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. మత్స్యకారులకు, ఆక్వా కల్చర్ రైతులకు వలలు, ఐస్ బాక్సులు, బోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి మత్య సంపద యోజన (PMMSY) పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలతో మేలు చేకూరుస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యులు రెడ్డప్పగారి మాధవిరెడ్డి, అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు, బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్, జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ (ఆఫ్ కాఫ్) సభ్యుల వివరాలు..
చీకటి శ్రీరాములు, DFCS ప్రెసిడెంట్, శ్రీకాకుళం.,
సింగిడి పాపారావు DFCS ప్రెసిడెంట్, విజయనగరం.,
యం. గురునాథ రావు, DFCS ప్రెసిడెంట్, విశాఖపట్నం,
యం. వసంత రావు, DFCS ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి., శ్రీ కొక్కిలిగడ్డ నాగ రమేష్, DFCS ప్రెసిడెంట్, కృష్ణా.,
కన్నా భూశంకర్, DFCS ప్రెసిడెంట్, గుంటూరు.,
జి. పేరయ్య, DFCS ప్రెసిడెంట్, ప్రకాశం.,కొండూరు పాలుశెట్టి, DFCS ప్రెసిడెంట్, నెల్లూరు.,
జి.వి. రత్నం, DFCS ప్రెసిడెంట్, చిత్తూరు.,బి.శివ నవీన్ కుమార్, DFCS ప్రెసిడెంట్, కర్నూలు.,
యం. నగేష్, DFCS ప్రెసిడెంట్, అనంతపురం.
ముందుగా చైర్మన్, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు..
జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్
