సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి గార్డెన్లో నిర్వహించిన సిపిఐ(ఎం) సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకుని ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో రెండు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ఇంకా 42 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. భూ సేకరణ, కాలువల నిర్మాణం, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ వివక్ష లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన భూమిలేని కార్మికులకు ఏడాదికి రూ.12,000, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు నెలకు రూ.2,500 హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, యూరియా యాప్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలిపారు. గ్రామాల్లో యూరియా కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతోందని ఆరోపించారు. సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామికవాదులు స్పందించాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు సిపిఐ(ఎం) పతాకాన్ని మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించగా నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
