ఎన్టీఆర్ జిల్లా,
చేనేత కళకు చేయూత.. వస్త్ర వైభవానికి ఉత్తేజం
- హస్తకళా నైపుణ్యానికి వేదిక ఇండియన్ సిల్క్ గ్యాలరీ
- సిల్క్ ఎక్స్పోను ప్రారంభించిన కేశినేని జానకీ లక్ష్మి
భారతీయ చేనేత కళకు చేయూతనిస్తూ వస్త్ర వైభవానికి కొత్త ఉత్తేజమిస్తూ ఎంతోమంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వేదికైందని, నేత కళాకారులే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బయటికంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని కేశినేని జానకీ లక్ష్మి అన్నారు.
కేంద్ర చేనేత, జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఆధ్వర్యంలో స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన సిల్క్ ఎక్స్పోను శుక్రవారం పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకీ లక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగర వస్త్ర ప్రియులను అలరించేలా ఏర్పాటుచేసిన ఎక్స్‌పోతో బెనారస్, పశ్చిమబెంగాల్ బొటిక్ ఐటెమ్స్, టస్సార్ కాంత, చందేరి, కోటా, రాజ్‌కోట్ పటోలా, గద్వాల్, కళంకారి, కాంచీపురం, వెంకటగిరి, ఉప్పాడ జాంధానీ.. ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సిల్క్ ఎక్స్పో ద్వారా భారతీయ సంప్రదాయ వస్త్రాల వైభవం నగరవాసులను అలరించనున్నదన్నారు.
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు, సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనకు పెద్దఎత్తున వస్త్ర ప్రియులు తరలి వస్తారని.. 100 శాతం చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఇది వేదిక అని తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండగల నేపథ్యంలో ఈ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో ఒక్కో ప్రాంత కళాకారులది ఒక్కో అద్భుత శైలి అని.. అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలను ఒకేచోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరల్లో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇలాంటి వస్త్రాలకు మద్దతివ్వడం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావి తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలవుతుందన్నారు. 64 స్టాళ్లతో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత పట్టు వస్త్రాలతో కూడిన ఈ ఎక్స్పో ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వీక్షించవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత క్లస్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
………………………………..
డిఐపిఆర్ఓ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారిచే జారీ చేయడమైనది
