చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి
- గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదైన కొండవీడుకోటను జాతీయ వారసత్వ సర్క్యూట్ లో చేర్చాలి : ప్రత్తిపాటి.
- జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణే ధ్యేయంగా కోటకు ఇన్ క్రెడిబుల్ ఇండియా, దేఖో అప్నా దేశ్ విభాగాల్లో మంచి ప్రాచుర్యం కల్పించండి : ప్రత్తిపాటి.
- కొండవీడు కోట సమగ్రాభివృద్ధిపై ఢిల్లీలో కేంద్రపర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించిన మాజీమంత్రి ప్రత్తిపాటి. గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన కొండవీటు కోట అభివృద్ధికి సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతిసమీపంలో ఉన్న కోట ప్రాంతం సహజసిద్ధమైన సరస్సులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని, అలాంటి ప్రాంత అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర పర్యాటకమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో కలిసి మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ప్రత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గానికే తలమానికంగా నిలిచే కొండవీడు కోట ప్రాశస్త్యాన్ని, దాని అభివృద్ధి ఆవశ్యకతను షెకావత్ కు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కొండవీడు ప్రాంతానికి తొలుత ఇన్ క్రెడిబుల్ ఇండియా, దేఖో అప్నా దేశ్ విభాగాల కింద విస్తృత ప్రాచుర్యం కల్పించాలని ప్రత్తిపాటి కేంద్రమంత్రిని కోరారు.
టీడీపీ హాయాంలో రూ.40కోట్లతో కొండవీడు కోట ఘాట్ రోడ్ అభివృద్ధి..
కొండవీడు కోట ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు 2018లో రూ.40కోట్ల వ్యయంతో కోట ఘాట్ రోడ్డును అభివృద్ధి చేశారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీప్రభుత్వం కొండవీడు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రత్తిపాటి కేంద్రమంత్రికి తెలియచేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా కళతప్పిన కొండవీడు కోటకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమిప్రభుత్వ ఆలోచని ప్రత్తిపాటి కేంద్రమంత్రికి వివరించారు.
కోటను జాతీయ వారసత్వ సర్క్యూట్ లో చేర్చండి…
కొండవీడు కోటను జాతీయ వారసత్వ సర్క్యూట్ లో చేర్చాలని, తద్వారా దాని ఖ్యాతి అంతర్జాతీయస్థాయిలో ఇనుమడిస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. కోటను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకోసం ఫుడ్ కోర్టులు, రోప్ వే మార్గం, పురావస్తు మరియు పర్యాటక మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఉదారంగా నిధులు వచ్చేలా చూడాలని ప్రత్తిపాటి షెకావత్ ను కోరారు. కోట యొక్క సమగ్రత, విశిష్టతను కాపాడటానికి కేంద్ర పురావస్తు విభాగం, సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో కోట నిర్మాణం, గోడలు, అక్కడ ఉన్న సహజ సిద్ధమైన సరస్సులు, చారిత్రత కట్టడాల పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి కోరారు.
పర్యాటకుల్ని ఆకర్షించడానికి లైట్ మరియు సౌండ్ షోలు, గైడెడ్ హెరిటేజ్ వాక్ లు, వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై తక్షణమే కేంద్రపర్యాటక శాఖ దృష్టి పెట్టాలని కేంద్రమంత్రిని ప్రత్తిపాటి అభ్యర్థించారు.
