విమర్శలను లెక్క చేయను, అభివృద్ధి నా ధ్యేయం…
-ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి //గోదావరిఖని నగరాన్ని విద్య,వైద్య,వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నoలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ కోరారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 19 వ డివిజన్ అల్లూరు, సంతోష్ నగర్ లో, 38వ. డివిజన్ సీతా నగర్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో నగర మేయర్ మహంకాళి స్వామి , అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ అరుణ శ్రీ తో కలిసి పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… బొందల గడ్డ గా మారిన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేసి, అద్భుత నగరంగా తీర్చి దిద్దడమే ధ్యేయంగా విమర్శలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నామని అన్నారు .
ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. రామగుండం నగరానికి మరో రెండు కొత్త భారీ పరిశ్రమలు రానున్న నేపధ్యంలో ఐదు లక్షల జనాభా తో ఒక మహా నగర స్థాయికి చేరుకుంటుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వం , ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించారని అన్నారు. రామగుండం నగరంలో కూడా ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ , ఎ టి సి , పి జి కళాశాల , నర్సింగ్ కళాశాల తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నట్లు తెలిపారు. స్వశక్తి మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించడానికి కోట్లాది రూపాయల సబ్సిడీ రుణాలు తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు.
స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనను ప్రోత్సహించడానికి రామగుండం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అల్లూరు , సంతోష్ నగర్ లలో డ్రెయిన్ లపై నిర్మించిన అనధికార కట్టడాలను తొలగించి నీళ్ళు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అలాగే ఎన్ టి ఆర్ నగర్ , కళ్యాణ్ నగర్ , సీతా నగర్ ల నుండి ప్రవహిస్తున్న పెద్ద కాలువ శుభ్రంగా తీర్చి దిద్దడంతో పాటు ప్రక్కన రోడ్డు నిర్మించే యోచన కూడా చేస్తున్నామని అన్నారు. అలాగే స్వంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు , స్థలం లేని పేద వారికి స్థలంతో పాటు ఇండ్లు కూడా మంజూరు చేస్తామని అన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు కూడా ఇప్పిస్తామని అన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని హాజరైన వారితో నగర మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలలో చెత్త వేయడం వలన దోమలు పెరిగి అనేక వ్యాధుల బారిన పడుతున్న విషయం గ్రహించాలని అన్నారు.
నగర పాలక సంస్థ స్వచ్చ వాహనాలకే చెత్త అందించి సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని కోరారు. ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులు చరుగ్గా సాగుతున్నాయని అన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు మునిసిపల్ సేవలకు సంబందిoచి ఇతర సమస్యలు, పెండింగ్ ఫైళ్ళ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి రామగుండం నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శ నగరంగా రూపొందిస్తామని అన్నారు. నగర పాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.
కాగా ఈ సంధర్భంగా మిషన్ భగీరథ విభాగం ఆద్వర్యంలో విలీన గ్రామం వెంకట్రావ్ పల్లి కుమార స్వామి నగర్ లో నిర్మించిన ఉపరిత వాటర్ ట్యాంక్ ను మేయర్ మహంకాళి స్వామి తో కలిసి ఎమ్మెల్యే ఎం ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అల్లూరు ,సంతోష్ నగర్ లో కాలువలను పరిశీలించారు . సీతా నగర్ లో చెత్త విభజన , సేకరణ పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు మారెల్లి సుశీలా రాజి రెడ్డి , నెలకoటి రాము , బుర్ర శశికళ , నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎస్ ఇ గురువీర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. వి రామన్ ,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
