
రోగులకు ఆసుపత్రిలో సత్వర వైద్య సేవలు అందించేలా చర్యలు….
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి// రోగులకు ఆసుపత్రిలో సత్వర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వైద్యశాఖ పని తీరు పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఓ.పి. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఎక్కువ మంది రోగులకు సేవలు అందించ లేకపోతున్నామని, ప్రతి విభాగంలో రోజుకు నిర్దిష్ట సంఖ్యలో టోకెన్ లు జారీ చేసి ఓపి సేవలు నిర్వహించాలని, అనంతరం వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రిలో ఆర్థో , డెంటల్, జనరల్ మెడిసిన్, గైనిక్, చిన్నపిల్లల స్పెషలిస్ట్, కంటి చికిత్స మొదలగు వివిధ విభాగాలలో ఎన్ని ఓపి టోకెన్లు ఉన్నాయో తెలియజేస్తూ డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
ల్యాబ్ టెస్ట్ పరీక్షల ఫలితాలు రోగులకు త్వరగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు జరిగే వైద్య పరీక్షలకు సంబంధించి నివేదిక అందజేయాలని, ఉదయం జరిగే పరీక్షలకు సాయంత్రం వరకు ఫలితాలు రోగులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రిలో ల్యాబ్, ఎక్స్ రే రూమ్, వివిధ ఓపీ రూమ్, ఇతర విభాగాలకు దారి చూపే విధంగా సింబల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రిలో ప్రతిరోజు ఎన్ని ఎక్స్ రే, స్కానింగ్ పరీక్షలు, రక్త పరీక్షలు జరుగుతున్నాయో నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్స్ రే యంత్రం, అవసరమైన స్టాఫ్ నియామకం కోరుకో ప్రతిపాదనలు అందించాలని, రోగులకు వైద్యులు ఆసుపత్రిలో పని వేళలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,డి సి హెచ్ ఓ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.