విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఆనం
➖ ఉపాధ్యాయులతో పాటూ తల్లిదండ్రులూ తమ బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..
➖ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అనుబంధాలకు వేదిక మెగా పేటిఎం…
➖ రేపటితరం భవిష్యత్ కోసం విద్యపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుంది
➖ క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధిని అలవరచుకుంటే విజయాలు విద్యార్థుల సొంతం : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
➖ చేజర్ల జడ్పీ ఉన్నతపాఠశాలలో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
చేజర్ల, : విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
శుక్రవారం ఉదయం ఆత్మకూరు నియోజకవర్గం చేజర్లలోని జడ్పీ హైస్కూల్లో మెగా పేటిఎం (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) కార్యక్రమాన్ని ఆహ్లాదకరవాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి అనుబంధం ఉండాలని, పాఠశాలలను సమాజానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు మెగా పేటీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ బిడ్డల బాగోగులు, పాఠశాల హాజరుశాతం, విద్యార్థుల ప్రగతి నివేదికలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజనపథకం మొదలైన విషయాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అర్థవంతమైన చర్చ జరిగి, సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ సమావేశం వేదికకానుందని మంత్రి వివరించారు. కేవలం ఉపాధ్యాయుల పర్యవేక్షణ మాత్రమే కాకుండా ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలపై ప్రత్యేక శ్రద్దపెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులది, విద్యార్థులది విడదీయలేని అనుబంధమన్న మంత్రి, విద్యార్థులందరూ తమ గురువులను గౌరవించాలని సూచించారు.
క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను అధిగమించి పాఠశాలకు, సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రేపటితరం భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలనే దృఢసంకల్పంతో విద్యారంగంలో అనేక సరికొత్త సంస్కరణలను కోట్లాది రూపాయలతో తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న విద్యావిధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించి అత్యుత్తమ విద్యాప్రమాణాలను మన విద్యార్థులకు అందించేందుకు విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన పౌష్టికాహారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, లీప్ యాప్ ద్వారా విద్యార్థుల ప్రగతి మొదలైన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని, తామంతా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివి ఉన్నతస్థానాలు సాధించినట్లు మంత్రి వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు.
తొలుత విద్యార్థులు ఏర్పాటుచేసిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనలను మంత్రి సందర్శించి, విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రయోగాల పనితీరును మంత్రికి విద్యార్థులు వివరించారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరికి ఆకట్టుకున్నాయి. పాఠశాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా జ్ఞాపికలను అందించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. భోజన మెనూ ఎలా వుంది, అన్ని ఆహారపదార్థాలు బాగున్నాయా? అని విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పావని, డిడివో రమణయ్య, డిప్యూటీ డిఇవో జానకిరాం, ఎంపిడివో అమర్, తహశీల్దార్ మస్తానయ్య, ఎంఇవోలు ఇందిర, మస్తానయ్య, పాఠశాల హెచ్ఎం శ్రావణ్, అసిస్టెంట్ హెచ్ఎం రమేష్‌బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
