కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే నాయిని

WhatsApp Image 2026 02 12 at 4.14.25 PM
TEJA NEWS

కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే నాయిని..

సార్వత్రిక సమ్మెకు వరంగల్‌లో విశేష స్పందన..

ఆటో నడుపుకుంటూ ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే నాయిని..

వరంగల్, ఫిబ్రవరి 12:
కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను బలహీనపరుస్తున్నాయని విమర్శిస్తూ వాటి రద్దు కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు వరంగల్‌లో విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు వందలాది బైక్‌లతో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ నుంచి వేలాదిమంది కార్మికులు కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా ఆటో నడుపుతూ ర్యాలీలో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ర్యాలీ మొత్తం బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లేబర్ కోడ్స్ అమలుతో ఉద్యోగ భద్రత తగ్గిపోవడం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విధానం విస్తరించడం, కాంట్రాక్ట్ వ్యవస్థ పెరగడం వంటి పరిణామాలు కార్మికుల జీవన భద్రతను దెబ్బతీస్తాయని అన్నారు. సమ్మె హక్కును పరిమితం చేయడం, యాజమాన్యాలకు అధిక అధికారాలు ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన 8 గంటల పని దినం అమలు, స్థిర ఉద్యోగాలు కల్పించడం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విధానాన్ని రద్దు చేయడం, కనీస వేతనం రూ.26 వేలుగా చట్టబద్ధంగా అమలు చేయడం, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద భీమా వంటి సామాజిక భద్రతా పథకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

అంగన్వాడి, ఆశా, మున్సిపల్, యూనివర్సిటీ, ఆటో, భవన నిర్మాణ, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మధ్యాహ్న భోజన, హాస్పిటల్ కార్మికులు తదితర రంగాలకు చెందిన వేలాదిమంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు, రైతులు కలిసి పోరాడుతున్న ఈ ఐక్యత ప్రభుత్వానికి స్పష్టమైన సందేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ,KUDA చైర్మన్,డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి , CITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం. చుక్కయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజు గౌడ్, ఐఎఫ్టియు నాయకులు అప్పారావు, రాజేందర్, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, ఏఐసిటియు జిల్లా కార్యదర్శి వి.ఎస్. రావు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కూర వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టి. ఉప్పలయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి దీప తదితర నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page