వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
- ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాల్సిందే
- క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రజలు సమస్యను తనకు నేరుగా తెలియజేయొచ్చు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుతో ప్రతి పౌరుడికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
బుధవారం నగరంలోని గిరిపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, విధులకు సకాలంలో హాజరవ్వాలని ఆదేశించారు. అనంతరం ఓపీ సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ రూమ్‌ల పనితీరు, టెలీ క్లినిక్ సేవల అమలు తీరును సమీక్షించారు. లేబొరేటరీ విభాగంలో జరుగుతున్న పరీక్షలు, నివేదికల జారీ విధానం, అవసరమైన పరికరాల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి, మందుల నిల్వలు, ఉచితంగా అందిస్తున్న ఔషధాల పంపిణీ, రోగులకు సరైన సమాచారం అందిస్తున్నారా అనే అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు తీరును పరిశీలించి, చిన్నారులు, గర్భిణులు తప్పనిసరిగా టీకాలు పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచార పట్టికలు, అవగాహన పోస్టర్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) ప్రయోజనాల సమాచారాన్ని సక్రమంగా ప్రదర్శించాలన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం పెంచుకునేలా సేవలు అందించాలని, శుభ్రత, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమస్య ఉంటే కలెక్టర్‌కు నేరుగా తెలియజేయండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై అభిప్రాయాలు, లేదా సమస్య ఉంటే ఆయా ఆసుపత్రుల్లో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి (8885592974) ప్రజలు నేరుగా తెలియజేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆసుపత్రుల్లో అందించే సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమర్థవంతమైన మానవ వనరులు, నిధులు వెచ్చిస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
