బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రతే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం…
-పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా….
పెద్దపల్లి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలివేయబడిన, అలాగే కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్ళు, వివిధ కంపెనీలు, రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా అవసరమైతే చిల్డ్రన్ హోమ్‌లకు పంపించడం జరుగుతుందని తెలిపారు.
దీనిలో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
రామగుండం కమీషనరేట్ పరిధిలో ప్రతి డివిజన్‌కు ఒక ఎస్.ఐ, నలుగురు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు కమీషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా, మొత్తం (166) మంది బాల బాలికలను గుర్తించినట్లు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలో బాలురు – 30, బాలికలు – 18, మొత్తం – 48 మందిని గుర్తించి, 05 కేసులు నమోదు చేసి 05 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని,
మంచిర్యాల జిల్లా పరిధిలో బాలురు – 93, బాలికలు – 25, మొత్తం – 118 మందిని గుర్తించి, 15 కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు గానీ, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు గానీ, లేదా తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాల కార్మికులను నియమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయడంలో పోలీస్ శాఖతో కలిసి కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.
