స్వర్ణరథంపై పద్మావతి అమ్మ సాక్షాత్కారం** వైభవంగా వార్షిక వసంతోత్సవాలు

TEJA NEWS

స్వర్ణరథంపై పద్మావతి అమ్మ సాక్షాత్కారం
** వైభవంగా వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 9.45 గంటల నుంచి స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. కాగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబు స్వామి, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, భాస్కర్, సుబ్బరాయుడు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top