పంచాయతీ సిబ్బందిలో పరేషాన్

TEJA NEWS

పంచాయతీ సిబ్బందిలో పరేషాన్

మోతె: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది పని భారం పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ, పేరుకుపోయిన చెత్త తొలగింపు, పిచ్చి మొక్కల నిర్మూలన, మురుగు కాల్వల శుభ్రపరిచే పనులు, లీకేజీ పైపుల మరమ్మతులు వంటి విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ అదనపు పనులు మోపుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.
గ్రామ పంచాయతీ పనులతో పాటు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, రైతు వేదికల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు కూడా పంచాయతీ సిబ్బందినే వినియోగిస్తున్నారని సమాచారం.

కొన్ని చోట్ల ప్రైవేట్ పనులు కూడా సిబ్బందితో చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా కార్యాలయాలకు సంబంధించిన పనులను అక్కడి సిబ్బందితో కాకుండా ప్రతి చిన్న పనికీ గ్రామ పంచాయతీ కార్మికులను ఉపయోగించుకోవడం వల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారం తగ్గించి గ్రామ పంచాయతీ పరిధిలోని విధులకే పరిమితం చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

You cannot copy content of this page

Scroll to Top