జగన్ సంకుచిత మనస్తత్వం వల్లే పేదలు గృహయోగానికి దూరమయ్యారు : మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి
పేదలకు సొంతిళ్లు లేకుండా చేసి, 5 ఏళ్లు వారిని ఏడిపించిన ఘనత జగన్ దే.
టిడ్కో గృహాలు పరిశీలించి లభ్దిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ప్రత్తిపాటి.
జగన్మోహన్ రెడ్డి అసూయ, దుగ్ధ ఇళ్లులేని నిరుపేదలకు శాపంగా మారిందని, చంద్రబాబు 2014-19లో నిర్మించిన టిడ్కో ఇళ్లలో చిన్నచిన్న పనులు చేయించి పేదలకు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి మనసురాలేదని మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్ టిడ్కో సముదాయంలో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ లభ్దిదారులకు అందించాల్సిన సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ ప్రారంభించిన మాజీమంత్రి, గృహస్తులకు ఫ్యాన్లు అందించి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. పేదలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, వారిని ఒక ఇంటివారిని చేయాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్టప్రభుత్వాల భాగస్వామ్యంతో 2014-19లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. టీడీపీ హాయాంలోనే ఇళ్ల నిర్మాణం 80 నుంచి 90 శాతం వరకు పూర్తైందని, రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పన పనులే నిలిచిపోయాయన్నారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు కట్టించిన ఇళ్లు పేదలకు ఇస్తే, తనకేమి ప్రయోజనమని భావించి బంగారం లాంటి ఇళ్లను పాడు పెట్టాడని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబుకు, టీడీపీకి పేరొస్తుందన్న దుగ్ధ, అసూయతోనే జగన్ పేదలను 5 ఏళ్లపాటు ఏడిపించాడన్నారు. నివాసానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్లను పాడుపెట్టింది కాక, తన పార్టీ రంగులేయించి, తానే నిర్మించినట్టు జగన్ గొప్పలు చెప్పుకున్నాడని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. ఇళ్లనిర్మాణపనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వారు చేస్తున్న పనులు కూడా ఆపేశారన్నారు. దాంతో నిర్మాణదశ పూర్తై, నివాసానికి సిద్ధంగా ఉన్న లక్షల ఇళ్లు దయ్యాలకు ఆవాసాలుగా మారి నిరుపయోగంగా మారిపోయాయని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ విపరీత మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని, దానివల్లే ఎంతోమంది ఇళ్లులేని పేదలు నివాసయోగానికి దూరమై 5 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డారన్నారు. అహంకారం, నిర్లక్ష్యంతో వ్యవహరించబట్టే 2024 ఎన్నికల్లో జగన్ ను, ఆయన పార్టీని ప్రజలు శాశ్వతంగా సాగనంపారని ప్రత్తిపాటి తెలిపారు.
వీధిదీపాలు వెలగడం లేదని, రోడ్లమరమ్మతులు చేయాలని, రోడ్లపక్కన ఉన్న పిచ్చిమొక్కల్ని తొలగించాలని టిడ్కో లబ్ధిదారులు తెలియచేయడంతో, ప్రత్తిపాటి అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. ఇళ్లలో నివాసముండే వారికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రత్తిపాటి అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, టీడీపీ నాయకులు షేక్ టిడీపీ కరిముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమాల రవి, జంగా సుజాత, జంగా వినాయకరావు, టీడీపీ నాయకులు, తదితరులున్నారు.
