
మహిళల భద్రతకు షీటీమ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది….
షీటీమ్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రాల పనితీరుపై సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం పోలీస్ కమిషనరేట్ మహిళల రక్షణ, భద్రతే షీటీమ్ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో షీటీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ), భరోసా కేంద్రాల సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళలకు షీటీమ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే స్పందించే విధంగా షీటీమ్ పనిచేయాలని సూచించారు.
భరోసా కేంద్రాల్లో లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సీపీ పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సంబంధించిన కేసులు నమోదైన వెంటనే బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు వారి మానసిక పరిస్థితి, విద్యా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు.
పిల్లల అశ్లీల వీడియోలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడం ఐటీ చట్టంలోని సెక్షన్ 67(బి) ప్రకారం నేరమని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, యువతులు షీటీమ్ నంబర్లకు లేదా డయల్ 100కు కాల్ చేసి నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
షీటీమ్ సంప్రదింపు నంబర్లు:
రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీమ్ : 63039 23700, పెద్దపల్లి జోన్ : 87126 59384, మంచిర్యాల జోన్ : 87126 59385,
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఇన్స్పెక్టర్ భీమేష్, పెద్దపల్లి ఏహెచ్టీయూ ఎస్ఐ శైలజ, మంచిర్యాల జోనల్ షీటీమ్ ఇన్చార్జ్ మహిళా ఎస్ఐ ఉషారాణి, భరోసా కేంద్రం, షీటీమ్ సిబ్బంది పాల్గొన్నారు.