ఆరుగురు “ఎర్ర” స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష
** ఒకొక్కరికి రూ.6లక్షల జరిమానా
తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహమూర్తి గురువారం తీర్పు నిచ్చినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 04/2017 కేసులో ఆరుగురు ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తిరుపతి జిల్లాకు చెందిన చాంద్ బాషా, అవినాష్, మర్రిచెట్టు నాగరాజు, ధనశేఖర్ ఎలియాస్ ధనంజయులు, వరదరాజులు ఎలియాస్ వరదయ్య, మూడే నాగరాజు ఎలియాస్ గుడుంబా నాగరాజు ఎలియాస్ నాగరాజు నాయక్.
వీరు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కరకంబాడీ ఫారెస్ట్ బీటు, టీఎన్ పాలెం సెక్షన్ ఎస్వీఎంపీ తిరుపతి రేంజ్ లో పట్టుబడ్డారు. వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆరుగురు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.
