జూలై 5నుంచి సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు / తిరుపతి: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 05న ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు:
జూలై 05న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలి వాహనం, 06 ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 07 ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహ వాహనం, 08 ఉదయం పల్లకీ సేవ, రాత్రి హనుమంత వాహనం, 09
ఉదయం శేష వాహనం,
రాత్రి గరుడ వాహనం,10న
ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11 ఉదయం ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు), రాత్రి గజ వాహనం, 12న
ఉదయం రథోత్సవం (ఉదయం 08 గంటలకు),
రాత్రి అశ్వవాహనం, 13న
ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం. జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
