
ధాన్యం స్టోర్ (నిల్వ) చేసేందుకు గోదాములలో స్థలం సిద్ధం చేయాలి…
పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
పెద్దపల్లి : ధాన్యం స్టోర్(నిల్వ) చేసేందుకు గోదాములలో స్థలం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలో పర్యటించారు. పెద్దపల్లి మండలం లోని ప్రభుత్వ ఆయుర్వేద హోమియో యునాని వైద్య కళాశాల, రాఘవపూర్ లోని జిఎంఆర్ వేర్ హౌసింగ్ గోదాములను, శాంతి నగర్ లోని వేర్ హౌసింగ్ గోదాములను అదనపు కలెక్టర్ వేణు తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాబోయే యాసంగి సీజన్ నందు ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే ఎస్.డబ్ల్యూ.ఎస్ పరిధిలో ఉన్న గోదాములలో ఖాళీ స్థలం ధాన్యం స్టోర్(నిల్వ) చేసుకునేందుకు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గోదాములలో ఉన్న బియ్యం త్వరగా లిఫ్ట్ చేసి ధాన్యం స్టోర్ చేసుకునేందుకు వీలుగా స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయుష్ ఆసుపత్రి నందు వస్తున్న రోగుల వివరాలు, అందుబాటులో ఉన్న మందులు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన మందుల స్టాక్ ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయూష్ ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డి సి హెచ్ ఎస్. డా.శ్రీధర్,డా. మారుతి ,డి.సి.ఎస్.ఓ.శ్రీనాథ్, డి.ఎం. సివిల్ సప్లై శ్రీకాంత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.