
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, వసతులపై ప్రత్యేక దృష్టి – కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
నాణ్యమైన ఆహారం, పరిశుభ్రతకు ప్రాధాన్యం, విద్యా సంవత్సరం ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశాలు
పెద్దపల్లి// .గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. సోమవారం వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్‌ను సందర్శించి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యానికి హైజీన్ ప్రమాణాలు అత్యంత కీలకమని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా డైట్‌ను అమలు చేయాలని తెలిపారు. ఆహార భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వంట ప్రక్రియలో శుభ్రత, నాణ్యతపై రాజీ పడకూడదన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైనప్పుడు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. చిన్నపిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి తెలిపారు.
పాఠశాలలో ఉన్న డ్రైనేజ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అవుట్‌లెట్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.
అనంతరం 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ పతకాలు ప్రదానం చేశారు. కలెక్టర్ చేతుల మీదుగా పతకాలు అందుకోవడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి శ్రీనాథ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఇతర అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.