పోలీస్ మైదానంలో ప్రత్యేక వైద్య శిబిరం

TEJA NEWS

పోలీస్ మైదానంలో ప్రత్యేక వైద్య శిబిరం

** మహిళా దినోత్సవంకు మహిళలకు సేవలు

తిరుపతి: మహిళలకు విశ్వాసాన్ని కల్పించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకు ని మహిళలకు పోలీస్ మైదానంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది మహిళల భద్రత, సాధికారతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు నేటి సమాజంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, నేరాలపై అప్రమత్తంగా ఉండే విధంగా చైతన్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, మహిళా ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాలు తదితర ప్రాంతాలను సందర్శించిన మహిళా పోలీసులు, పోలీసు అధికారులు మహిళలకు భద్రతకు సంబంధించిన అంశాలు, సైబర్ నేరాలు, మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు.

మహిళలు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండి చట్టపరమైన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో రాత్రిపూట గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తూ సమాజంలో మహిళల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ మహిళల భద్రతకు కట్టుబడి ఉందని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో తిరుపతి పోలీస్ మైదానంలో మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్‌లో మహిళలకు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్‌లో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.


మహిళలు నేటి సమాజంలో ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, అదే సమయంలో చదువు, ఉద్యోగం, సేవా రంగాలు తదితర అన్ని విభాగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అన్నారు. ప్రతి రంగంలో తమదైన శైలిలో ముందుకు సాగుతూ మహిళలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది తమ ధైర్యం, నిబద్ధత, క్రమశిక్షణతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో మహిళా పోలీసులు ముందుండి పనిచేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

మహిళా పోలీసు సిబ్బంది పోలీస్ శాఖకు ఒక ప్రత్యేక బలమని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మహిళల సాధికారత, మహిళా భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని విశేష సేవలందించిన మహిళా సిబ్బందిని అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా సిబ్బందితో కలిసి భోజనం చేసి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. పోలీస్ కుటుంబ సభ్యులుగా ఎల్లప్పుడూ మీకు నేను అండగా ఉంటాననే భావన కలిగేలా సిబ్బందిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సతీమణి ఎల్.ఇందు హారిక, అదనపు ఎస్పీ సతీమణి కీర్తి, విమలాకుమారి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), రవిమనోహర ఆచారి (శాంతి భద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), పోలీస్ డాక్టర్ మాధురి, సీఐడీ డీఎస్పీ హేమలత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తమిమ్ అహ్మద్, మహిళా పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top