నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కొరకు ప్రత్యేక సమావేశం…..
పెద్దపల్లి / నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కొరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మొత్తం 60 మంది సభ్యుల్లో సమావేశానికి హాజరైన 49 మంది వార్డు సభ్యులచే ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా పరిషత్ సి ఇ ఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సమావేశానికి బి ఆర్ ఎస్ పార్టీ నుండి గెలిచిన 10 వ వార్డు సభ్యులు అడ్డాల గట్టయ్య , 40 వ డివిజన్ కార్పొరేటర్ కజంపురం జయప్రద తప్పా మిగిలిన 11 మంది వార్డు సభ్యులు హాజరు కాలేదు. తెలుగు అక్షరమాల ప్రకారం 10వ. డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య మొదట ప్రమాణం చేయగా,ఆఖరున 17 వ డివిజన్ అనుము స్వరూప ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 46వ.డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి పేరును 9 డివిజన్ కార్పొరేటర్ తాళ్ళపెళ్ళి యుగంధర్ ప్రతిపాదించగా 38వ. డివిజన్ కార్పొరేటర్ నెలికంటి రాము బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో మేయర్ పదవికి మహంకాళి స్వామి ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.
ఆ తరువాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 57వ. డివిజన్ కార్పొరేటర్ పాతపెల్లి ఎల్లయ్య పేరును 30 వ.డివిజన్ కార్పొరేటర్ ఇసంపల్లి అంజయ్య ప్రతిపాదించగా 31వ. డివిజన్ కార్పొరేటర్ షాహెదా బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో డిప్యూటీ మేయర్ గా పాతపెల్లి ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.
ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గం శాసన సభ్యులు , నగర పాలక సంస్థ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ ( స్థానికసంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ , ఎన్నికల పరిశీలకులు పద్మజా రాణి , నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా నూతన పాలక వర్గం పని చేయాలని రామగుండం నియోజకవర్గం శాసన సభ్యులు , నగర పాలక సంస్థ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ సూచించారు . రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ లో సోమవారం నిర్వహించిన మేయర్ , డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడాతూ… అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాల పట్ల కార్పొరేటర్లు దృష్టి సారించాలని అన్నారు. పార్టీ విధేయత , సీనియారిటీ , అనుభవం ప్రాతిపదికన మేయర్ , డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థులను అధిష్టానం ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
నిఖార్సయిన ప్రజా సేవకులు దొరికారని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కొరకు జోన్ లుగా విభజించుకోవడం తప్పా ఎయిట్ ఇంక్ లైన్ కాలనీ , గోదావరి ఖని , ఎన్ టి పి సి , రామగుండం వేర్వేరు ప్రాంతాలు కాదని రామగుండం నగర పాలక సంస్థ పరిధి అంతా ఒకే ప్రాంతమని అన్నారు. పాలన ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం 50 డివిజన్ ల నుండి 60 డివిజన్ లకు పెంచడం జరిగిందని అన్నారు.
ఐకమత్యంతో పార్టీలకతీతంగా అన్ని డివిజన్ లను అభివృద్ది చేయడమే లక్ష్యంగా తమ పాలక వర్గం పని చేస్తుందని అన్నారు. రామగుండం లో జరుగుతున్న అభివృద్ది విషయంలో ప్రజలు నిజం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , జిల్లా మంత్రి శ్రీధర్ బాబు స్మార్ట్ జిల్లా గా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనే తలంపుతో పూర్తి సహకారం అందజేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రామగుండం నగరాన్ని వైద్య , విద్య , వ్యాపార , పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని, అధికారులు , సిబ్బందితో ప్రేమగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేసుకోవాలని నూతన సభ్యులకు సూచించారు.
స్థానిక శాసన సభ్యులు ఎo . ఎస్. రాజ్ ఠాకూర్ నేతృత్వంలో రామగుండం నగరాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తామని కొత్తగా ఎన్నికైన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ లో మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత 20 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటూ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలిచి పార్టీకి విధేయుడుగా ఉన్నానని అన్నారు.
ఎమ్మెల్యే ఎo . ఎస్. రాజ్ ఠాకూర్ , వారి సతీమణి మనాలీ రాజ్ ఠాకూర్ తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఆశీర్వదించడంతో పాటు ,మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రాజకీయంగా ఎదిగి మేయర్ పదవి చేపట్టగలిగానని అన్నారు.
కష్ట పడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. . దేశ విదేశాల్లోని నగరాలతో పోటీ పడే విధంగా , మెట్రో నగరాలకు ధీటుగా రామగుండం నగరాన్ని అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారని అన్నారు.
ఈ ప్రయత్నంలో తాము భాగస్వాములమవుతామని, తాను మేయర్ గా ఎన్నిక కావడానికి సహకరించిన కార్పొరేటర్లకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో మురికివాడల్లో అభివృద్ది పనులు చేపట్టడం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, నగరంలో అన్ని ప్రాంతాలకు రక్షిత మంచి నీటి సరఫరా , రోడ్లు , మురుగు నీటి కాలువలు , అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ అందుబాటులోకి తెచ్చే విధంగా పని చేస్తామని అన్నారు. తమ పని తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని అన్నారు.
ప్రగతి పథంలో ముందుకు దూసుకు వెళుతున్న రామగుండం నగర అభివృద్దిలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ లో డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత 40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉండి చేసిన సేవలను , అనుభవాన్ని ఎం ఎల్ ఎ గుర్తించి ఎంతో నమ్మకం తో తనకు ఈ పదవి అప్పగించారని అన్నారు.
పార్టీకి కట్టుబడి విధేయతతో పని చేసి ఆయన నమ్మకాన్ని నిలబెడతానని ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ , మేయర్ మహంకాళి స్వామి ఆద్వర్యంలో రామగుండం నగరాన్ని రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని, తాను డిప్యూటీ మేయర్ కావడానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
