
తిరుమల పాపనాశనంలో ప్రత్యేక నాఖాబందీ
తిరుమల: తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణల సంయుక్త ఆదేశాలతో… తిరుమల అదనపు ఎస్పీ, డీఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో పాపవినాశనం ప్రాంతంలో పోలీస్ శాఖవారి ప్రత్యేక నాఖాబందీ జరిగింది. ఇందులో
పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్, రెవెన్యూ, ఎక్సైజ్, హెల్త్ తదితర శాఖలకు చెందిన సుమారు 52 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి పాపవినాశనం ప్రాంతంలోని షాపులు, వాహనాలు, సిబ్బంది వివరాలు, లైసెన్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో మొత్తం 110 షాపులను పరిశీలించగా, సరైన గుర్తింపు కార్డులు లేని 6 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు లేని 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న 21 షాపులను గుర్తించారు. అదేవిధంగా 24 మంది అనుమానితుల వేలిముద్రలను పరిశీలించారు. షాపులు టీటీడీ, ఫారెస్ట్ శాఖల కేటాయింపుల ప్రకారమే నిర్వహిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న వర్కర్ల వివరాలను ధృవీకరించారు. గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు వంటి నిషేధిత వస్తువులను వినియోగించరాదని, తీసుకురరాదని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానికులకు వివరిస్తూ… అపరిచితులకు షాపులు బాడుగకు ఇవ్వకూడదని, సరైన గుర్తింపు లేకుండా పనుల్లో నియమించకూడదని అధికారులు సూచించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా 1972 నెంబర్లను వినియోగించాలని అవగాహన కల్పించారు.
స్థానిక యువత, వర్కర్ల చేత డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారులు పూర్తి సహకారం అందించారు.