
పెద్దపల్లికి రాష్ట్రస్థాయి బ్యాంకు లింకేజీ అవార్డు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: స్వశక్తి సంఘాల బ్యాంకింగ్‌లో రాష్ట్రంలో తొలి స్థానం
పెద్దపల్లి జిల్లా స్వశక్తి సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకు లింకేజీ అవార్డుల కార్యక్రమంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లాకు అవార్డు ప్రదానం చేశారు.
ఈ అవార్డును పెద్దపల్లి జిల్లా తరఫున గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. కాలింది, అదనపు డీఆర్డీఓ బి. రవీందర్, డీపీఎం వెంకటరమణయ్యతో పాటు చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య కార్యదర్శి జె. శోభ స్వీకరించారు.
గత ఆర్థిక సంవత్సరం 2025–26లో జిల్లాలోని 7,716 స్వయం సహాయక సంఘాలకు రూ.477.86 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించగా, అందులో 6,851 సంఘాలకు రూ.454.66 కోట్ల మేర బ్యాంకు లింకేజీ అందించి లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
స్వశక్తి సంఘాల ఆదాయ వృద్ధికి బ్యాంకు లింకేజీలు సమర్థవంతంగా అందించేందుకు సెర్ప్ సిబ్బంది సమిష్టిగా కృషి చేయడంతో ఈ ఘనత సాధ్యమైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా రుణాల చెల్లింపుల్లో జిల్లా కేవలం 0.85 శాతం ఎన్పీఏతో రాష్ట్రంలోనే ఉత్తమ రీపేమెంట్ రికార్డును నమోదు చేసింది.
అలాగే గత ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందించి, వసూళ్లలోనూ విశేష ఫలితాలు సాధించడంతో పెద్దపల్లి జిల్లా మరోసారి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా సెర్ప్ సిబ్బంది ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షించారు.