పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాలి
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్
వనపర్తి జిల్లాలోని
ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల చదువుకు ప్రభుత్వ అధికారులు తోడ్పాటు అందించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ చేశారు. ఆయన అమరచింత మండలంలోని కొంకనివాని పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రారంభమై 13 రోజులు గడుస్తున్న పుస్తకాలు అందలేదని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలు సకాలంలో అందించకపోతే వారి విద్య ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా పేదలను దోచుకుంటున్నాయని సకాలంలో పుస్తకాలు అందకపోతే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కొంకన్వాని పల్లి గ్రామానికి పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వంశీ, భాను, శేఖర్ పాల్గొన్నారు.
