రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఆర్థిక ఉన్నతే, తెలంగాణ ప్రగతికి బాటలు వేస్తుంది: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి
మహిళా సంక్షేమంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలని ఆర్థికంగా బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
వనపర్తి పట్టణంలోని స్థానిక దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, ఇందిరమ్మ చీరల పంపిణీ చేసేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అధ్యక్షతన ఇందిర మహిళా శక్తి సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా 2023-24, 2024-25 కి సంబంధించి 529 సంఘాలకు గానూ రూ. 1.60 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల కిందట కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 9న మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఫైల్ మీద చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు సారె పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా .. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు. మహిళా సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ చీరలు చేరుతాయని తెలిపారు.
18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సంకల్పంతో నేడు రాష్ట్రంలో అన్ని స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని నమ్మిన సీఎం రేవంత్ రెడ్డి నేడు మహిళల ఉన్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకువస్తున్నారన్నారు.
స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని మాఫీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా మరణించిన సభ్యురాలు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తుందని తెలియజేశారు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడం ద్వారా పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వీటితోపాటు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించి పేదవారి పిల్లలు సైతం ఉన్నత విద్య అభ్యసించాలని సకల సౌకర్యాలతో ఉన్నత వర్గాల పిల్లలు చదివే స్థాయి విద్యను అందజేయనుందని తెలిపారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు పావలా వడ్డీ రుణాన్ని తీసుకువచ్చారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ద్వారా 75% సమస్యలను తీర్చగలిగామని సగర్వంగా చెప్పారు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. నేడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను సమకూర్చే ఉన్నత బాధ్యతలను మహిళలకు అప్పచెప్పమన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు బస్సులను కొని ఆర్టీసీలో పెట్టడమె కాకుండా, స్వయంగా పెట్రోల్ పంపు లను సైతం ప్రారంభిస్తున్నారన్నారు. వనపర్తి లో రూ. 5 కోట్లతో మహిళా సంఘాలకు భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం మరిచిపోయిందని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని చెప్పారు. వనపర్తి పట్టణంలో 60 కోట్ల రూపాయలతో గల్లి గల్లీలో సిసి రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఆరోగ్య సేవలను రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచామన్నారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు బ్యాంకుల్లో పిలిచి మరి రుణాలు ఇస్తున్నారని తెలిపారు. మహిళల కోసం అత్యధిక సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేద మహిళ పేరుమీద ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని లక్ష్యంతో వనపర్తి లో రూ. 1.60 కోట్ల వడ్డీ లేని రుణాలను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు ఇందిరమ్మ క్యాంటీన్లతోపాటు, ఇతర వ్యాపార రంగాల్లో ముందుకెళ్తున్నారన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నేడు వనపర్తి పురపాలికలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
