పిల్లలకు ఉత్తమ సంస్కారాలు బాల్యంలోనే నేర్పించాలి.
సూర్యపేట : భావిభారత పౌరులైన చిన్నారులకు తల్లిదండ్రులు బాల్యంలోనే చదువుతోపాటు ఉత్తమ సంస్కారాలు నేర్పించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఎన్.సి.హెచ్ వేణుగోపాలాచార్యులు అన్నారు. దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బాలల ఆధ్యాత్మిక ,వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల ముగింపు ఉత్సవంలో వారు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగిస్తూ శ్రీరాముని జీవితం ఆధారంగా చిన్నారులకు నైతిక మానవతా విలువలు నేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మీలా మహదేవ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ నాగవల్లి ప్రభాకర్ మాట్లాడుతూ 12 రోజులపాటు జరిగిన ఈ తరగతులలో విద్యార్థులకు ఇతిహాస కథలు, వ్యక్తిత్వ వికాసం ,యోగ, భజనలు,ఆటలు, హనుమాన్ చాలీసా, భగవద్గీత వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రతిరోజు 80 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ తరగతిలో పాల్గొన్నారనీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, యోగా విన్యాసాలు, సాహసకృత్యాలు ప్రదర్శించారు, వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీ మీలా మహాదేవ్, శ్రీ వేణుగోపాలాచార్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పర్వతం శ్రీధర్ కుమార్ ,నాగవల్లి దశరథ దేవులపల్లి ప్రశాంతి, భాస్కరాచారి, పోలా వీరభద్రరావు ,భాను ప్రసాద్ ఉప్పలయ్య ,సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
