ఇలా వచ్చి..అలా వెళ్లారు

TEJA NEWS

ఇలా వచ్చి..అలా వెళ్లారు!

** టీటీడీ పరకామణి దోపిడీ కేసు విచారణకు “భూమన”

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి కొనసాగిన సమయంలో తిరుమల శ్రీవారి పరకామణి దోపిడీకి గురైన కేసు సీఐడీ విచారణలో కొనసాగుతోంది. ఈనేపథ్యంలో సాయంత్రం తిరుపతిలోని టీటీడీ గెస్ట్ హౌస్ లో గల సీఐడీ తాత్కాలిక ఆఫీస్ లో విచారణకు రావాలని భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన నివాసంలో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వచ్చారు. ఆ నోటీసులో సూచించిన మేరకు భూమన కరుణాకర్ రెడ్డి సాయంత్రం 3.30 గంటలకు టీటీడీ గెస్ట్ హౌస్ కు రావాలి. అయితే ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటి నుంచీ సాయంత్రం వరకు అందరి మదిలో భూమన హాజరుపై వస్తారో… రారో… అంటూ సందిగ్దత కొనసాగింది. అయితే ఎట్టకేలకు భూమన కరుణాకర్ రెడ్డి సరిగ్గా 3.45కు విచారణ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. విచారణకు లోపలికి వెళ్ళేటప్పుడు, తిరిగి బయటకు వచ్చినప్పుడు మీడియాతో సరిగా మాట్లాడకనే సాయంత్రం 4.10కే తిరుగు పయనం అయ్యారు.

అయితే సీఐడీ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిని సుధీర్ఘంగా విచారించి అనేక కీలక అంశాలు రాబడుతారని భావించిన ప్రతి ఒక్కరికీ ఇటు సీఐడీ… అటు భూమన పెద్ద ట్విస్ట్ ఇచ్చి విచారణ కేవలం 10, 15 నిముషాలు కూడా జరగక్కుండానే ముగిసినట్లు అనిపించారు. కానీ టీటీడీ అదనపు ఈఓగా అప్పుడు కొనసాగిన అధికారి కూడా నేడో… రేపో సీఐడీ ముందుకు రానున్న దరిమిలా భూమన కరుణాకర్ రెడ్డిని తొలిసారి ఇలా కొన్ని నిమిషాలే విచారించి పంపారనే టాక్ తిరుపతిలో జోరుగా వినబడుతోంది. మరి సీఐడీ అధికారులు భూమనను మళ్ళీ విచారణకు పిలిచి డిసెంబర్ 2న హై కోర్టుకు ఏ నివేదిక ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top