
సూర్యాపేటలో ముగ్గురు గంజాయి నేరస్థుల అరెస్ట్
సూర్యాపేట జిల్లా ప్రతినిధి
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం (06-05-2026) సూర్యాపేట రూరల్ పోలీసుల తనిఖీలలో ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. సూర్యాపేట రూరల్ ఎస్.ఐ ఎన్. బాలు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కుసుమవారిగూడెం గ్రామ శివారులోని ఇంధిరమ్మ కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉదయం సుమారు 10.30 గంటలకు మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు దగ్గరకు రాగానే వారు పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి పేర్లు దేశగాని గణేష్ (19), పశుల రాంచరణ్ (19), పోతురాజు బన్ని (19)గా గుర్తించారు.
వీరి వద్ద నుంచి 1 కిలో 160 గ్రాముల గంజాయి మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా, ముగ్గురు కలిసి సీలేరు ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి, 10 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1000కి విక్రయించాలని యోచించినట్లు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో విక్రయించేందుకు వెళ్తుండగా ఎవరూ కొనకపోవడంతో తిరిగి వస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్‌పీ నర్సింహా ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్.ఐ బాలు నాయక్, రూరల్ పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.