శంకర్పల్లికి మూడు కొత్త రైళ్లు.. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు: మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం
శంకర్పల్లి: శంకర్పల్లి రైల్వే స్టేషన్ కు మూడు కొత్త రైళ్లు మంజూరయ్యాయని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికుల దృష్ట్యా స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరగా వెంటనే స్పందించి ( హైదరాబాద్- విజయపుర), (రాయచూర్ – పర్భని), (పర్భని-రాయచూర్) మూడు రైళ్ళను ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతుల సౌకర్యం కొరకు రైలు క్రాసింగ్ దాటడానికి ఇబ్బందులు పడుతున్నందుకుగాను కొండకల్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫతేపూర్ లో 20 ఫీట్ల వెడల్పుతో అండర్ బ్రిడ్జి, గొల్లగూడ లో ఓవర్ బ్రిడ్జి, ముబారక్ పూర్ లో అండర్ బ్రిడ్జిలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు, ప్రయాణికులు, మండల, మున్సిపల్ ప్రజలు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
శంకర్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు అసంపూర్తి
మున్సిపాలిటీ ఆదాయానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గండి కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆరోపించారు. మున్సిపాల్టీ ఆదాయంతో ఎమ్మెల్యే డ్రైవర్ జీతాలు, వాహనంలో డీజిల్ కొట్టించుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా చేసి పూర్తి బిల్లులను తీసుకున్న ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు చెల్లుతుందన్నారు. పత్తేపురం వంతెన నుంచి తీగల వాగు వరకు రైన్ వాటర్ పనులు, రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ పనులు పూర్తి చేసినట్లుగా బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. వీటన్నింటికీ ప్రజా క్షేత్రంలో సమాధానం చెప్పాలని, పూర్తి చేసిన అభివృద్ధి పనులు చూపించాలని మాజీ ఎమ్మెల్యే
కెఎస్ రత్నం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బసగళ్ల రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షురాలు లీలావతి బయానంద్, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ్ కన్నా, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, అనిశెట్టి సురేష్, పాండురంగం, దండు రామ్మోహన్, విటోబా, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, పండిత్ రావు గౌడ్ ఉన్నారు.
