కాలినడకన మెట్ల మార్గంలోనే తిరుమలకు….
** గత “తుడ” పాలకులకు భిన్నంగా దివాకర్ రెడ్డి
తిరుపతి: తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్వగ్రామం అయిన పెరుమాళ్లపల్లి తిరుమల కొండకు కిందనే దగ్గరగా ఉండడంతో చిన్ననాటి నుంచి అమితమైన గోవింద భక్తి కలిగి ఉండడం కారణంగా అద్భుత పదవులు వరించినా….. తన చిన్ననాటి భక్తి ప్రపత్తులను మరువని దివాకర్ రెడ్డి తిరుమలకు కాలినడక ద్వారా మెట్ల మార్గంలో యాత్ర సాగించారు. తనతో పాటు భార్య, కుటుంబ సభ్యులను కూడా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు నుంచి వెళ్లే నడక మార్గంలో గురువారం రాత్రే కొండకు చేరుకున్నారు. మెట్లపై సాగిన యాత్రలో శ్రీవారి నామ స్మరణతో అందరినీ భక్తిలో పులకింపజేశారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామి వారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి దివాకర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదంతో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
