తిరుపతిని దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తా
** ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ల మీట్ లో తుడా చైర్మన్
తిరుపతి: రానున్న ఐదేళ్లలో తిరుపతి జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధిపై విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాలయం ప్రొఫెసర్లతో మంగళవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తుడ చేపడుతున్న ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను వారికి తెలియజేశారు. భవిష్యత్తులో తిరుపతి జిల్లా వ్యాప్తంగా తుడ చేపట్టదలచిన ప్రాజెక్టులను వివరించారు. తుడాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను కోరారు.
ఈ సందర్భంగా వారు స్పందిస్తూ తుడాభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని కావలసిన సహాయ సహకారాలను తమ విద్యాలయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వేస్టేషన్ లు, జాతీయ రహదారులు, సముద్ర మార్గం కూడా ఉందని వీటిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. అంతకు ముందు విద్యాలయం ప్రొఫెసర్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిస్ట్రక్చర్ విద్యాలయం ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అయోన్, ఆర్చిస్ట్రక్చర్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రణాళిక విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ వర్ధన్, అర్బన్ డిజైన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, స్కాలర్ సుమంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
