కేంద్ర మంత్రి, ఎంపీలకు ఘన సత్కారం
- ఎంపీ వద్దిరాజు గ్రానైట్ జ్ఞాపికల బహుకరణ
రంగారెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేలతో పాటు ఆ శాఖ పార్లమెంటరీ సలహా సంఘం సభ్యులకు ఘనమైన సత్కారం లభించింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ పార్లమెంటరీ సలహా మండలి సమావేశం మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులు, ఎంపీలకు సింగరేణి యాజమాన్యం ఆతిథ్యం ఇచ్చింది. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ సమీపంలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో హాజరైన సభ్యులకు రాజ్యసభ ఎంపీ, సలహా సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో గ్రానైట్ జ్ఞాపికలు బహుకరించారు. తన సొంత గ్రానైట్ క్వారీ నుంచి సేకరించిన నల్లరాయి పై మంత్రులు, ఎంపీల చిత్రాలను కార్వింగ్ చేయించి, వాటిని జ్ఞాపికల రూపంలో బహుకరించారు.
ఎంపీ రవిచంద్ర విదేశి పర్యటనలో ఉండటం చేత ఆతిథ్య సంస్థ సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ వాటిని మంత్రులు, అతిధులకు బహుకరించారు. గ్రానైట్ రాయిపై ప్రత్యేకంగా రూపొందించిన చిత్రాలను చూసి మంత్రులు, అతిథులు ముగ్థులయ్యారు. ఈ సందర్భంగా వారు ఎంపీ రవిచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు అతిథులకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు.
