పింక్ బస్సు క్యాంపులను వినియోగించుకోండి
** ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్యులు
తిరుపతి: వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యం అందించే దిశగా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి ద్వారా నిర్వహిస్తున్న పింక్ బస్సు క్యాంపులను అందరూ వినియోగించుకోవాలని స్విమ్స్ వైద్యులు సూచించారు. టీటీడీ పీఆర్వో విభాగం సహకారంతో క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించేందుకు వీలుగా 35 ఏళ్లు దాటిన మహిళలందరూ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోన కోరారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో పిహెచ్ సి పరిధిలోని నిడిగల్లు, అలిమిలి గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
పింక్ బస్సుల క్యాంపులు గురువారం (నేడు) 29న గొట్టికాడు, నిండలి గ్రామాల్లో జరగనున్నాయి. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను, సర్పంచులు సిహెచ్.గాయత్రి, దొరబాబు, పంచాయతీ కార్యదర్శులు డి.మోహన్ రాజు, చంద్రశేఖర్, స్థానిక నాయకులు మునివెంకటేశ్వర్లు, రఘురెడ్డి, సిహెచ్ఓ బి.నీరజ, సూపర్వైజర్ టివి.నరసింహారావు, ఏఎన్ఎంలు కె.రమాదేవి, ఎస్.సుహాసిని, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
