
మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్ళాలి.!.
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి, ఏప్రిల్ – 05.మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు, తో కలిసి పాల్గొన్నారు.
బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నత జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు.
చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ళ వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు.
అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,
జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అదనపు కలెక్టర్ కోనియాడారు. చిన్న తనం నుంచే అంటరానితనం వ్యతిరేకంగా పోరాటం చేశారని, అతి చిన్న వయస్సులో కేంద్ర మంత్రి గా పని చేశారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొని జైళ్ళు జీవితాన్ని గడిపారని అన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని, అతి చిన్నవారైనందున బేబీ మినిస్టర్ గా పిలవబడే వారని, రాజకీయాల్లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా, సుదీర్ఘ కాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజకీయ రంగంలో, సామాజిక వేత్త గా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. చిన్న వయస్సు నుంచి విద్య పై శ్రద్ధ వహించి ఆ కాలంలో బీఎస్సీ పట్టా సాధించారని, 30 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా కృషి చేసి దేశానికి సేవ చేశారని కొనియాడారు.
1971 యుద్ద సమయంలో రక్షణ శాఖ మంత్రి గా పని చేశారని తెలిపారు. మన రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రోత్సహించా రని, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణ లో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులను జగ్జీవన్ రావ్ తీసుకొని వచ్చారని ఆయన తెలిపారు.
జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో మనమంతా సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తీసుకుని రావాలని, కాలం, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రావని, వీటిని సద్వినియోగం చేసుకుంటే దారిద్రంలో ఉన్నవారు సైతం ధనవంతులుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు
అంతకు ముందు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎం. రవీందర్, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.