5 ఏళ్లలో నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం..

TEJA NEWS

5 ఏళ్లలో నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం..

  • పదేళ్లలో రాని నిధులు.. ఇప్పుడు మంజూరు చేశాం..
  • రూ. 530 కోట్లతో తాగునీటి సరఫరా పనులకు శ్రీకారం..
  • మేయర్ సుధారాణితో కలిసి పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హనుమకొండ

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, ఐదేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం బీటీ రోడ్లు..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందులో భాగంగా 5వ డివిజన్‌ పరిధిలో రూ. 90 లక్షల వ్యయంతో మార్కాజీ స్కూల్ నుండి మంగలి వాగు బ్రిడ్జి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అలాగే, 30వ డివిజన్ చిల్డ్రన్ పార్కులో రూ. 70 లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు భూమి పూజ చేశారు.
నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం
నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన తాగునీటి సమస్యపై నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. “గత 10 ఏళ్లలో నియోజకవర్గానికి రాని నిధులను ప్రభుత్వం నుంచి సాధించాం. ముఖ్యంగా వాటర్ సప్లై మెరుగుపరచడం కోసం రూ. 530 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించాం. త్వరలోనే పశ్చిమ పరిధిలో నీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం

అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో ఎమ్మెల్యే నాయిని చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వార్డుల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. క్వాలిటీతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ,రావుల కోమల, డివిజన్ అధ్యక్షులు స్రవంతి,రమేష్,నాయకులు బొంత సారంగం,మాజీ కార్పొరేటర్ మాధవి,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు స్థానిక కాలోని ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top