*ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి”
ఉపాధ్యాయుడిగా మారి పదో తరగతి విద్యార్థులకు గణితం పైథాగరస్ సిద్ధాంతం పై మెలకువలు బోధించిన కలెక్టర్
పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి
తెలంగాణ గురుకులాల్లో సీటు కొరకు పోటీ అధికంగా ఉందని, అటువంటి అవకాశం సాధించిన విద్యార్థులు బాగా చదువుకొని పదో తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జిల్లా కలెక్టర్ కొత్తకోట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వండే ఆహారాన్ని తప్పనిసరిగా గ్యాస్ స్టౌవ్ పై మాత్రమే వండాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఆహారం విద్యార్థులకు వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి తర్వాతనే అందించాలని ఆదేశించారు.
అనంతరం ఆహార పదార్థాల నిల్వ గదిని పరిశీలించి, మెస్ కమిటీ పనిచేస్తుందా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, పాఠశాలకు సరఫరా అయ్యే ఆహార పదార్థాలను దిగుమతి చేసినప్పుడు మెస్ కమిటీ విద్యార్థులు తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య నివేదికలను పరిశీలించి, ఆరోగ్యం పై సూచనలు చేశారు.
తర్వాత పదో తరగతి విద్యార్థుల గదిని సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. రాబోయే బోర్డు పరీక్షల నేపథ్యంలో అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్ల కోసం చాలా పోటీ మరియు డిమాండ్ ఉంటుందని, మీకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు.
ఈ సందర్భంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని సులభమైన పద్ధతుల్లో ఎలా అర్థం చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారికి నోట్‌బుక్స్‌ను అందజేసి ప్రోత్సహించారు.
డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ పరిమళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, ఎంఈఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
