ప్రజా సేవలో నిమగ్నమైన నూతన సర్పంచ్ : కోర్సా రాజేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
స్థానిక గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా తిరుమలకుంట నూతన సర్పంచ్ కోర్సా రాజేష్ తన బాధ్యతను చాటుకుంటున్నారు. (ఐటిడిఏ) ద్వారా గ్రామంలోని కొండరెడ్లు తెగకు చెందిన వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.
సర్పంచ్‌గా గెలుపొందిన వెంటనే తన తొలి ప్రాధాన్యతగా పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాజేష్ నడుం బిగించారు. రెడ్డిగుంపు గ్రామంలో గృహ మంజూరుకు ఎంతమంది అర్హులు ఉన్నారనే అంశాన్ని అధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సర్వేలో భాగంగా గ్రామంలోని మొత్తం 37 ఇళ్లను పరిశీలించగా అందులో 16 ఇళ్లు ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 21 కుటుంబాలు నూతన ఇళ్ల కోసం అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి న్యాయం జరిగేలా పారదర్శకంగా ఈ సర్వేను పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా సేవ కోసమే తనను ఎన్నుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. గెలిచిన వెంటనే ప్రజల మధ్యకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సర్పంచ్ రాజేష్‌ను గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
