అక్రిడేషన్ల జీవో 252ను సవరించాలి
కలెక్టర్ కు టీడబ్ల్యూజేఎఫ్ కమిటీ వినతి పత్రం అందజేత
సూర్యపేట జిల్లా : తెలంగాణ ప్రభుత్వం మీడియా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం విడుదల చేసిన జీవో 252 ను సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా సమన్వయ కమిటీ సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడారు. అక్రిడిటేషన్ల జీవో 252 లో అభ్యంతరాలను సవరించాలని సూచించారు. డెస్క్ జర్నలిస్టులకు, రిపోర్టర్లకు వేర్వేరు రకాల కార్డులు జారీ చేయడం పట్ల ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.అదే విధంగా వార, పక్ష,మాస దినపత్రికల అర్హతకు సంబంధించి జారీ చేసిన నిబంధనలో మార్పులు తీసుకురావాలని కోరారు.
వార పత్రికలకు కనీసం 45 సంచికలు పక్షపత్రికలకు కనీసం 22 సంచికలు, మాసపత్రికలకు కనీసం 11 సంచికలు సమర్పించాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. ఈ విధానం పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, న్యాయమైన జర్నలిస్టులను తొలి దశలోనే వృత్తికి దూరం చేసేందుకు ఈ జీవో తోడ్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దినపత్రికలు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(పీఆర్ జీఐ) నుండి సర్టిఫికెట్ దాఖలు చేయాలనే నిబంధన చేర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. కేబుల్ చానళ్ళకు విధించిన కఠినమైన నిబంధనను సడలించాలని సూచించారు. జీవో 252 పాత్రికేయులపై సెన్సార్షిప్ విధించినట్లుగా ఉందని వారు పేర్కోన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వారిలో సూర్యాపేట జిల్లా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో- కన్వీనర్లు ముషం హరి ప్రసాద్, లింగాల సాయిబాబా, తాందార్ పల్లి శ్రీనివాస్, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, కొంగల సతీష్ తదితరులు పాల్గొన్నారు
