ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే విజన్ డాక్యుమెంట్
** రాష్ట్ర బడ్జెట్ పై టీడీపీ నేత “వెంకిటీల” ప్రశంసలు
చిత్తూరు: రాష్ట్ర భవిష్యత్ కు స్పష్టమైన దశను, దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో కోట్లాది మంది జీవితాలకు విజన్ డాక్యుమెంట్ లాగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ప్రసంశించారు. బడ్జెట్ పై శనివారం సాయంత్రం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెటు ను కూటమి ప్రభుత్వం రూపొందించడంతో ప్రజల జీవితాలలో నిజమైన మార్పు వచ్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా, వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయితీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూలేని విధంగా మూలధన వ్యయానికి రూ.53,915 కోట్లు కేటాయించడం అభినందనీయం.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. గత ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతులకు కేటాయింపులకు మించి రూ.1200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవడం జరిగింది.
ఈ ఏడాది కూడా రూ.500 కోట్లు కేటాయించి రైతులకు అండగా గత ప్రభుత్వం అయిదేళ్లలో ధరల స్థిరీకరణకు ఖర్చు చేసింది రూ.880 కోట్లు మాత్రమే.
సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.4 వేల కోట్లు అధికంగా కేటాయించడం జరిగింది.
గత ఏడాది బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.6,357 కోట్లు కేటాయించడం జరిగింది.
సంక్షేమానికి గత ఏడాది రూ.41,726 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.53,190 కోట్లు కేటాయించడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు రూ.1500 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,567 కోట్లు, నైపుణ్యా వృద్ధికి రూ.1,232 కోట్లు కేటాయించడమైంది.
పంచాయితీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.11 వేల కోట్లు, ఆక్వా సబ్సిడీగా రూ.890 కోట్లు కేటాయించడం జరిగింది. గృహనిర్మాణ శాఖకు రూ.6,357 కోట్లు, వైద్యశాఖకు రూ.19,306 కోట్లు, పౌరసరఫరాలకు రూ.3,821 కోట్లు కేటాయించడమైనది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించారు. న్యాయ వ్యవస్థకు రూ.349కోట్లు కేటాయించడం అభినందనీయం. ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకునేలా బలహీనవర్గాల జీవన ప్రమాణాలలో మార్పు జరిగేలా బడ్జెట్ రూపొందించడం జరిగింది.
విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు దోహదపడుతుంది.
