మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్
- వేగవంతంగా, పారదర్శకంగా సమస్యల పరిష్కారానికి చొరవ
- రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
బుధవారం విజయవాడలోని గోపాల్ రెడ్డి రోడ్డు నందుగల జల వనరుల నిర్వహణ, సమగ్ర రైతు శిక్షణ కేంద్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లా (ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు) నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల విచారణతో పాటు కొత్త ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. అనంతరం మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….. 9వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. ఈనెల 13వ తేదీ విశాఖపట్నంతో జన్ సున్వాయ్ కార్యక్రమం మొదటి దశ పూర్తవుతుందన్నారు. ఇప్పటినుంచి ప్రతి జిల్లాలో మహిళా సమస్యలపై జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా వేగవంతంగా, పారదర్శకంగా సమస్యలను అధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు.
విచారణ అధికారుల పనితీరుపై బాధితులు అసంతృప్తి చెందితే వారి స్థానంలో మరో అధికారిని నియమించాలని జిల్లా ఎస్పీలకు సూచిస్తామన్నారు. జన్ సున్వాయ్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని పెండింగ్ కేసుల విచారణ తో పాటు కొత్త కంప్లైంట్ లు కూడా రావడం ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా జన్ సున్వాయ్ లో ఎక్కువగా గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మోసపూరిత వివాహాలు, డొమెస్టిక్ వైలెన్స్, వంటి కేసులు ఎక్కువగా మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయన్నారు. మహిళా సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడి పోరాటం చేయటానికి మహిళా కమిషన్ సిద్ధమన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని వారికోసం న్యాయవాదులను నియమించి వారికి న్యాయ సహాయం కూడా చేస్తామన్నారు. మహిళలను ఇబ్బందులకు గురి చేసే ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ పూజిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డిపిఓ జ్యోతి, ఏసీపీలు వెంకటేశ్వరరావు, ప్రసాదరావు,దుర్గారావులు పాల్గొన్నారు
ఇట్లు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వారి పిఆర్ఓ
