చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల కీలక పాత్ర పోషిస్తాయి : కలెక్టర్

TEJA NEWS

చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల కీలక పాత్ర పోషిస్తాయి : కలెక్టర్

సూర్యాపేట జిల్లా : జిల్లాలోని సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను పరిశీలించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, అభిరామ్, నాగశ్రీ, లాస్య, శివకుమార్ మరియు శృతి వంటి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను కూడా పరిశీలించి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తదనంతరం అదే రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అలాగే వంట గదిని పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, కేంద్రంలో శుభ్రతను కాపాడాలని, భోజనాన్ని మంచిగా ఉడకపెట్టి అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అందే పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అదే రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలోని వీధులు, కాలువలు, చెత్త నిర్వహణ విధానం వంటి అంశాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో చెత్త పేరుకుపోకుండా సమయానికి తొలగించాలని, ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, అందరూ కలిసి సమన్వయంతో ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛమైన గ్రామ వాతావరణం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో డీపీఓ యాదగిరి, తహసిల్దార్ కృష్ణయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top