
పెద్దపల్లిలో వరల్డ్ టిబి డే ర్యాలీ నిర్వహణ…
పెద్దపల్లి : క్షయవ్యాధి నివారణ దినోత్సవం (వరల్డ్ టిబి డే) సందర్భంగా పెద్దపల్లి జిల్లా పట్టణ కేంద్రంలో టిబి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీ జిల్లా ప్రధాన ఆసుపత్రి, పెద్దపల్లి నుండి ప్రారంభమై పురవీధుల గుండా అమర్‌చంద్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అనంతరం క్షయవ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం “ఎస్ వుయ్ కేన్ ఎండ్ టిబి (అవును, మనం టిబిని అంతం చేయగలం)” అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుందని, టిబి రోగి దగ్గు, తుమ్ము, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని వివరించారు.
టిబి ముఖ్య లక్షణాలు:
రెండు వారాలకు మించిన దగ్గు,
జ్వరం, ఆకలి లేకపోవడం
రాత్రిపూట చెమటలు పడడం,
బరువు తగ్గడం అని అన్నారు.
ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్-రే వంటి పరీక్షలు వైద్యుల సూచన మేరకు చేయించుకోవాలని సూచించారు.
సాధారణ టిబి రోగులకు 6 నెలల పాటు ఉచిత చికిత్స అందిస్తారని తెలిపారు. మొదటి 2 నెలల ఇంటెన్సివ్ దశలో 4 రకాల మందులు ఇవ్వబడతాయి. అనంతరం మళ్లీ పరీక్షలు చేసి తదుపరి చికిత్స కొనసాగిస్తారు.
డ్రగ్ రెసిస్టెంట్ టిబి (ముదిరిన టిబి) విషయంలో, గతంలో చికిత్సను పూర్తిగా చేయకపోవడం వల్ల క్రిమి మందులకు ప్రతిఘటన కలుగుతుందని, ఇలాంటి రోగులకు 8 రకాల శక్తివంతమైన మందులతో 1 నుండి 2 సంవత్సరాల పాటు చికిత్స అవసరమని తెలిపారు.
నిక్షయ్ శివిర్ 100 రోజుల కార్యక్రమాన్ని 7 డిసెంబర్ 2025 నుండి 17 మార్చి 2026 వరకు నిర్వహించడం జరిగింది అని అన్నారు.
లక్ష్యంగా పెట్టుకున్న 1,64,790 మందిలో 1,52,741 మందికి ఎక్స్-రే పరీక్షలు, 22,364 మందికి తెమడ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,421 మందికి టిబి నిర్ధారణ అయిందని, వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, సి.హెచ్.సి లు, జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి, రామగుండం జనరల్ ఆసుపత్రిలో టిబి తెమడ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. శ్రీరాములు, డా. కె.వి. సుధాకర్ రెడ్డి, డాక్టర్ బి కిరణ్ కుమార్, ఏఆర్టి మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, ఐఆర్సిఎస్ అధ్యక్షులు రాజగోపాల్, డి. శ్రీనివాస్, ఎస్. వెంకటేశ్వర్లు, టిబి ఛాంపియన్స్, ఎన్జీవోలు, పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది మరియు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.