
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యం : జిల్లా వైద్యాధికారి
సూర్యాపేట జిల్లా : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెండెం వెంకటరమణ మాట్లాడుతూ, మలేరియా నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. ఈ ఏడాది మలేరియా దినోత్సవం “మలేరియా నిర్మూలనకు కృషి: ఇప్పుడు మనం చేయగలం… ఇప్పుడు మనం తప్పక చేయాలి” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇంటి చుట్టూ కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమతెరలు వినియోగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
చలి, జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మలేరియా పరీక్షలు మరియు చికిత్స అందిస్తున్నదని తెలిపారు. కోరోక్విన్ వంటి ఔషధాలు వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని చెప్పారు. జిల్లాలో చివరి మలేరియా కేసు మార్చి 2026లో నమోదైందని పేర్కొంటూ, 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది సాధ్యమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. జి. చంద్రశేఖర్, మలేరియా ప్రోగ్రామ్ అధికారి డా. జి. ప్రసిద్ధ్, ఏంహెచ్‌ఎన్ ప్రోగ్రామ్ అధికారి డా. నాజియా, వైద్యాధికారిణి డా. వాసవి, డీపీఓ ఉమా మహేశ్వరి, డిప్యూటీ డెమో సంజీవ్ రెడ్డి, ఎస్‌ఓ వీరయ్య, హెచ్‌ఈ శ్రద్ధా దేవి, ఏఎన్ఎం మోతీలాల్, ఎపిడెమియాలజిస్ట్ సత్యం, డీపీఎంఓలు కృష్ణయ్య, ఆనంద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మలేరియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.