
అవినీతి.. దోపిడీ తప్ప వైసీపీ ఐదేళ్లు ప్రజలకు ఏం చేసింది? : ప్రత్తిపాటి
రాజకీయ ఉనికి కోసమే ఆ పార్టీ నేతలు చంద్రబాబు, కూటమిప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
- బేరాలు కుదరక బైపాస్ నిర్మాణాన్ని రెండేళ్లు వాయిదా వేసి, అమాయకుల మరణాలకు కారకులయ్యారు.
- టీడీపీకి పేరొస్తుందని ముస్లిం బాలికల పాఠశాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
- టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధుల్ని దారిమళ్లించి… అభివృద్ధిని అటకెక్కించారు.
- ప్రజలకు రోజూ శుభ్రమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థులుగా మిగిలారు.
- కూటమి ప్రభుత్వంలో నిత్యం అభివృద్ధి… సంక్షేమమే.
- నిధుల సమస్య తప్ప.. ప్రభుత్వ స్పందనలో ఎలాంటి తాత్సారం లేదు.
- రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి.
గెలిపించిన ప్రజల్ని తమ దోపిడీ వనరులుగా మార్చుకొని, ఐదేళ్లు రాష్ట్రాన్ని లూఠీ చేసిన వారు నిస్సిగ్గుగా, కూటమిప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని, గత పాలకుల పాపాల్ని ప్రజలు అంత తేలిగ్గా మరువరని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని బ్యాంకు కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్లు నువ్వేం చేశావని ప్రజలు మాజీ అవినీతిమంత్రిని కడిగి పారేస్తున్నారు
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోని వారు.. నేడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, నియోజకవర్గాన్ని ఐదేళ్లపాటు గాలికొదిలేసిన వారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మాట్లాడతున్నారని ప్రత్తిపాటి ప్రశ్నించారు. కమీషన్ల బేరం కుదరలేదనే టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ నిర్మాణాన్ని మాజీ అవినీతి మంత్రి రెండేళ్లు వాయిదా వేశారన్నారు. ఐదేళ్లు వైసీపీ చేసిన పాపాల్ని ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరని, ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం వెలగబెట్టావమ్మా అని నియోజకవర్గ ప్రజలు మాజీ అవినీతిమంత్రిని కడిగిపారేస్తున్నారని, ఆ అవమానభారం, అక్కసుతోనే వారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గానికి మంజూరైన నిధుల్ని దారిమళ్లించారని, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల సమస్యల్ని పూర్తిగా విస్మరించారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్ నిర్మాణాన్ని ఆలస్యం చేసినందుకు అమాయకులు బలైపోయారన్నారు. చివరకు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడా ప్రతిరోజూ అందించలేకపోయారన్నారు. అలాంటి వారు తమ ఉనికికోసం పనిచేసే ప్రభుత్వంపై, ప్రజా రాజధానిపై, అభివృద్ధి పనులపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
రూ. 7 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం.. త్వరలో మరో 5 కోట్ల పనులు ప్రారంభిస్తాం
పట్టణంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడా రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ప్రత్తిపాటి చెప్పారు. రూ.7కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలోనే మరో రూ.5కోట్ల పనులకు టెండర్లు పిలవబోతున్నామని చెప్పారు. పట్టణంలో కొత్త చేపల మార్కెట్ నిర్మిస్తున్నామని, పాత ప్రభుత్వాసుపత్రిని ఆధునీకరించి ప్రజా వైద్యశాలగా మార్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైన ముస్లిం బాలికల పాఠశాల నిర్మాణాన్ని కూడా గతపాలకులు రాజకీయ ప్రయోజనాలకోసం నిలిపివేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పనిచేసే నాయకులుంటే ప్రజలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారన్నారు. పట్టణంలో కొన్నిచోట్ల ఆకతాయిలు వీధిలైట్లు పగలగొడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు కోరిన పనులు చేయడంలో కూటమిప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నిధుల కొరత వల్ల ప్రజల అవసరాలు తీర్చడంలో కొంత జాప్యం జరుగుతోంది కానీ, ప్రభుత్వ స్పందనలో ఎలాంటి తాత్సారం లేదని ప్రత్తిపాటి తెలిపారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, మురకొండ మల్లిబాబు, ముల్లా కరీముల్లా, బేరింగ్ మౌలాలి, అమరా రమాదేవి, మున్సిపల్ డిఈ రహీమ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు