
అరుదైన బోన్ ట్యూమర్ శస్త్రచికిత్స విజయవంతం…
క్లిష్టమైన వైద్య సేవలకు నిలయంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. జమ్మికుంట పట్టణ సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతికి ఎడమ మోకాలి పైభాగంలో చిన్ననాటి నుంచే ఎముక పెరుగుదల సమస్య ఉండగా, వైద్యులు అప్పట్లో వయస్సు పెరిగిన తరువాతే శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
తదుపరి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించగా, శస్త్రచికిత్సకు భారీ ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలుసుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్‌ను సంప్రదించారు.
సూపరింటెండెంట్ వెంటనే స్పందించి ఎముకల వైద్య నిపుణులు డా. కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం యువతికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి బోన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు.
ఈ శస్త్రచికిత్సలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కుమార్ గౌడ్, డా. వినయ్, మత్తు వైద్యురాలు డా. స్వాతి పాల్గొన్నారు. విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని, ఓటీ సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా డా. శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు కేంద్రం సేవలు, 2డీ ఎకో సేవలు, ఆధునిక లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు, యూరాలజీ సేవలు, రూట్ కెనాల్ చికిత్సలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సానిటేషన్, వాష్‌రూమ్ శుభ్రత లేదా ఇతర సేవలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే నర్సింగ్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ లేదా నేరుగా సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులను కంప్లైంట్ బాక్స్‌లో కూడా ఇవ్వవచ్చని, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు పూర్తిగా ఉచితమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి లంచాలు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.