ఫేక్ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తే క్రిమిన‌ల్ కేసులు

TEJA NEWS

ఫేక్ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తే క్రిమిన‌ల్ కేసులు
** పార‌ద‌ర్శ‌కంగా మెగా డీఎస్సీ అభ్య‌ర్థుల ఎంపిక

విజ‌య‌వాడ‌(తిరుపతి) :
మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న 421 పోస్టుల‌కు సంబంధించి ఫేక్ స‌ర్టిఫికెట్లు జ‌త‌ప‌రిచే అభ్య‌ర్థులు, ఫేక్ స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేసే క్రీడా సంఘాల‌ నిర్వాహ‌కుల‌పై క్రిమినల్ కేసులు త‌ప్ప‌వ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ‌(శాప్) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు హెచ్చరిక చేశారు. శాప్ ప్ర‌ధాన కార్యాల‌యంలోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో శాప్ ప‌రిపాల‌నా అధికారులు, ప‌లు విభాగాల బాధ్యుల‌తో సోమ‌వారం ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్‌ రవినాయుడు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా కింద భ‌ర్తీ చేయ‌నున్న ఉద్యోగాల విష‌యంలో స్క్రీనింగ్ క‌మిటీ స‌భ్యులు ప‌క‌డ్బందీగా, పార‌ద‌ర్శ‌కంగా అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌న్నారు. ఉద్యోగానికి అర్హత క‌లిగిన ఏ ఒక్క క్రీడాకారుడు న‌ష్ట‌పోకుండా నిష్ప‌క్ష‌పాతంగా, అవినీతికి తావులేకుండా ఎంపిక జ‌ర‌గాల‌న్నారు. మెగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని ఇప్ప‌టికే కొన్ని స్పోర్ట్స్ అసోసియేష‌న్లు, ఫెడ‌రేష‌న్లు ఫేక్ స‌ర్టిఫికెట్లు ఎర‌వేసి సొమ్ము చేసుకుంటూ క్రీడాకారుల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడుకుంటున్నాయని వివ‌రించారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హ‌త‌ను క‌ల్పిస్తూ ఫేక్ స‌ర్టిఫికెట్లు జారీ చేసి స్పోర్ట్స్ అసోసియేష‌న్ల నిర్వాహ‌కులు ల‌క్ష‌లు కాజేస్తున్నార‌ని వెల్ల‌డించారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే మా దృష్టికి కొన్ని ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న మెగా డీఎస్సీని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, దానికి అనుగుణంగా డీఎస్పీ స్థాయి అధికారితో క్రీడాకారుల స‌ర్టిఫికెట్లను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఫేక్ స‌ర్టిఫికెట్లు తీసుకున్నా, ఫేక్ స‌ర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు న‌మోదు చేయించి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

అభ్య‌ర్థులైనా స‌రే ఉపేక్షించే ప్ర‌స్తక్తే లేద‌ని, ఎంత‌టివారైనా స‌రే ఉక్కుపాదం మోపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఫేక్ స‌ర్టిఫికెట్ల‌ గుర్తింపున‌కు ప్ర‌త్యేక బృందం ప‌నిచేస్తుంద‌న్నారు. అలాగే ఫోర్జ‌రీ సంత‌కాలు, ఫేక్ స‌ర్టిఫికెట్ల జారీకి పాల్ప‌డిన అసోసియేష‌న్ల ప్రెసిడెంట్లు, సెక్ర‌ట‌రీల ప‌దవుల‌ను జీవిత‌కాలం ర‌ద్దు చేస్తామ‌న్నారు. క్రీడాకారుడు ఏ సంవ‌త్స‌రంలో అయితే ఆడాడో అదే స‌మ‌యంలో ప్రెసిండెంట్‌గా, సెక్ర‌ట‌రీగా ఉన్న‌వారి సంత‌కాల‌తోపాటు దానికి సంబంధించిన‌ ఆధారాల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌న్నారు. ఫేక్ స‌ర్టిఫికెట్లకు అడ్డుకుట్ట ప‌డాల్సిందేన‌ని, జిల్లాస్థాయి క‌మిటీ ద‌గ్గ‌రే పూర్తిస్థాయిలో ప‌క్కాగా అభ్య‌ర్థుల వ‌డ‌పోత జ‌ర‌గాల‌ని ఆదేశించారు. దీనిపై రాష్ట్ర క‌మిటీ మ‌రింత ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ విష‌యంలో అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తే వారిపై కూడా శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ముఖ్యంగా అభ్య‌ర్థుల‌కు శారీర‌క ధారుఢ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, అలాగే భ‌విష్య‌త్తులో ఫేక్ స‌ర్టిఫికెట్లకు తావివ్వ‌కుండా డిజి లాక‌ర్ సిస్ట‌మ్‌ను మ‌రింత వాడుక‌లోనికి తీసుకురావాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాప్ ఏఓ ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణ నాయ‌క్‌, టీఎస్ఓ ఎస్వీ ర‌మణ‌, ఎస్ఓలు కోటేశ్వ‌ర‌రావు, మ‌హేష్‌, సురేంద్ర‌, కిషోర్‌, ఏడీలు వేణు, మ‌ల్లేశ్వ‌రిభాయ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top